Virat Kohli: కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం!: పంజాబ్ నేషనల్ బ్యాంక్
- మా బ్రాండ్ అంబాసడర్ గా కోహ్లీ కొనసాగుతాడు
- నగదు ఉపసంహరణపై పరిమితి విధించలేదు
- మా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం
సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నీరవ్ బ్రాండ్ కు ప్రచారకర్త అయిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా... ఆ బ్రాండ్ తో తెగదెంపులు చేసుకుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరాట్ ముగింపు పలకబోతున్నాడనే కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పందించింది. తమ బ్రాండ్ అంబాసడర్ గా కోహ్లీ కొనసాగుతాడని... అతనిని వదులుకోబోమని ఓ ప్రకటనలో తెలిపింది. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని తగ్గించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా అవాస్తవమేనని పేర్కొంది.