Mane group of Companies: పెళ్లి కానుకగా 'థర్మోకోల్ టాయిలెట్లు' ఇస్తున్న పూణే వ్యాపారి!
- రెండు గంటల్లోనే టాయిలెట్ల తయారీ
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 వేలు సరఫరా
- పెళ్లి కానుకగా 25 టాయిలెట్ల బహూకరణ
దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జనకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా...పూణేలోని ఓ వ్యక్తి థర్మోకోల్ టాయిలెట్ల నిర్మాణం ద్వారా తన వంతు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. ఆయన పేరు రామ్ దాస్ మానే. ఆయన 1993లో 'మానే గ్రూప్ ఆఫ్ కంపెనీస్'ని స్థాపించాడు. ఇది థర్మోకోల్ మెషీన్లను తయారు చేస్తుంది. అందువల్ల థర్మోకోల్తో టాయిలెట్లను తయారు చేయాలనే ఆలోచనతో ఆయన ఈ బృహత్ కార్యానికి నాంది పలికారు. ఈ టాయిలెట్లకు చివరగా సిమెంట్ పూత వేస్తారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి రెండు గంటల సమయం పడుతుంది.
"టాయిలెట్లను కట్టుకునే ఆర్థిక స్థోమత లేని పేద ఆడపిల్లలకు పెళ్లి కానుకగా కూడా ఈ థర్మోకోల్ టాయిలెట్లను అందజేస్తున్నాం. ఇప్పటివరకు 25 టాయిలెట్లను బహుమతిగా ఇచ్చాం" అని రామ్ దాస్ మీడియాకి తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 వేల టాయిలెట్లను సరఫరా చేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యాపారం ద్వారా తనకు లాభం గానీ నష్టం గానీ రావడం లేదని ఆయన అన్నారు. ఈ సృజనాత్మక ప్రయత్నానికి గాను ఆయనకు పలు సంస్థలు, ప్రభుత్వాలు అనేక రకాల అవార్డులను ప్రదానం చేశాయి. 2007లో ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ చోటు సంపాదించారు. ప్రస్తుతం రామ్ దాస్ కంపెనీలో 70 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ టర్నోవర్ ఏడాదికి దాదాపు రూ.40 కోట్ల పైమాటే.