Bihar: నాకు విషం పెట్టి చంపాలని చూశారు: తేజస్వీ యాదవ్ సంచలన విమర్శలు!
- నా ర్యాలీలకు అద్భుత ప్రజా స్పందన
- తట్టుకోలేకపోతున్న నితీశ్ సర్కారు
- విషం పెట్టి చంపాలని చూసింది
- మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తేజస్వీ
నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం తనకు విషం పెట్టి చంపాలని చూసిందని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన విమర్శలు చేశారు. తాను రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్క్యూట్ హౌస్ లలో బస చేస్తుంటానని, అక్కడ తాను తినే ఆహారంలో విషం కలపాలన్న ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని రెండు రోజుల క్రితం ఆరోపించిన ఆయన, తన యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని కూడా వ్యాఖ్యానించారు.
తనను చంపాలని చూస్తున్న విషయాన్ని తాను ప్రభుత్వంలోని తనకు విశ్వసనీయంగా ఉండే వర్గాల నుంచి తెలుసుకున్నానని తేజస్వీ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "ఫోన్ ట్యాపింగ్ తరువాత నాపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా ర్యాలీలకు వస్తున్న ప్రజలను చూసిన సర్కారుకు భయం వేసి ఈ పని చేయాలని ప్రయత్నించింది" అని ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.