Chandrababu: ప్రత్యేక హోదా కోసం కేంద్ర సర్కారుని అడగకుండా.. నన్ను తిడుతున్నారు: ప్రతిపక్షాలపై చంద్రబాబు గరం గరం
- కొందరు నేతలు నిద్రలేచినప్పటి నుంచి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు
- ఒక న్యూస్ పేపరుందీ.. అందులో అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు
- ఆ పేపరుని ఎవరైనా నమ్ముతారా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడంపై కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తనను తిడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొన్ని పార్టీల నేతలు నిద్రలేచినప్పటి నుంచి తనను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు. ఈ రోజు అనంతపురంలోని పెనుకొండలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు... కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి అందించాల్సిన సాయం అందించట్లేదని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం చేస్తే ఇప్పుడు ఏపీ మరింత వేగంగా అభివృద్ధి చెందేదని వ్యాఖ్యానించారు.
'ఒక న్యూస్ పేపరుందీ.. ఆ పేపరు పేరు నేను చెప్పలేను మీకే తెలుసు.. అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు.. ఆ పేపరుని ఎవరైనా నమ్ముతారా?' అని ప్రశ్నించారు. కాగా, అరకొర నిధులిచ్చి చేయి దులుపుకుంటున్నారని కేంద్రాన్ని ఆయన నిందించారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సి ఉందని చెప్పారు. తాము 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.