Andhra Pradesh: ‘కియా’ ఇప్పుడు మన పరిశ్రమ .. దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి : సీఎం చంద్రబాబు
- అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని ప్రారంభించిన చంద్రబాబు
- భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు
- ‘కియా’కు నీరు, భూమి .. కల్పించడంలో ఇబ్బంది ఉండదు
- ఏపీని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు
‘కియా’ ఇప్పుడు మన పరిశ్రమ అని, కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్ద భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్ స్టలేషన్ విభాగాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కియా కంపెనీకి భూములిచ్చిన రైతులకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
రైతులు చూపించిన చొరవతోనే కియా పరిశ్రమ ఈ జిల్లాకు వచ్చిందని, వాహన తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం కొరియా అని ప్రశంసించారు. అనంతపురం కియా ప్లాంట్ కు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ సంస్థ ప్రతినిధులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. నీరు, భూమి, విద్యుత్, మానవ వనరులు కల్పించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని, ఆటోమొబైల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా, 2019 మార్చి నాటికి ప్లాంటు నుంచి తొలి కారు మార్కెట్ లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.