Andhra Pradesh: విశాఖ, తిరుపతిలో ఎఫ్ఈసీలు.. ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
- 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు
- ఏసీబీలో అదనపు పోస్టులు భర్తీకి ఆమోదం
- శ్రీకాకుళం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు భూమి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత కరవు భత్యాన్ని మంజూరు చేయాలని, దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1న తీసుకునే మార్చి నెల జీతంతోపాటు అందించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులో ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సచివాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి కాల్వ తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు పాత రేట్లకే ముందుకొచ్చిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రూ.1244.36 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతిని ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఎపీఇడిబి)కు స్వయం ప్రతిపత్తి కల్పించే ముసాయిదా బిల్లుని ఆమోదించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి భయాలు లేకుండా వివాదరహితంగా ఉండేలా చూడటానికి బోర్డుకు స్వయం ప్రతిపత్తి కల్పించే బిల్లు దోహదపడుతుందని మంత్రిమండలి భావించినట్లు పేర్కొన్నారు. ఏపీ ఈడీబీ చట్టం 2018 అనుసరించి స్టేట్ ఇన్వెస్టుమెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ), స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించేలా బిల్లు రూపొందించారని వివరించారు.
విశాఖ, తిరుపతిలలో ఎఫ్ఈసీలు
జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పోరేషన్) పరిధిలో కుటుంబ వినోద కేంద్రం (ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్-ఎఫ్ఈసీ) ఏర్పాటుకు ఎస్పీఐ సినిమాస్ ప్రెవేట్ లిమిటెడ్ (డెవలపర్)కు 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన 2.7 ఎకరాలను కేటాయించేందుకు జీవీఎంసీ కమిషనరుకు అనుమతి ఇస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. లీజు రూపంలో మొదటి ఏడాది రూ. 4.284 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఏడాదికి 5 శాతం చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు.
పీపీపీ పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టుని రూ.25 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారన్నారు. ప్రాథమికంగా ఏపీ టూరిజం కార్పోరేషన్(ఏపీటీడీసీ) దీని ఖర్చులను భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీనిని నిర్వహిస్తుందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో ఎఫ్ఈసీ ఏర్పాటుకు అన్నమయ్య సర్కిల్‌లో 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన 3.72 ఎకరాలను ఎస్పీఐ సినిమాస్ కు కేటాయించేందుకు తుడా వైస్ చైర్మన్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లీజు రూపంలో మొదటి ఏడాది రూ.3.26 కోట్లు చెల్లించే విధంగా, ఏడాదికి 5 శాతం చొప్పున లీజు మొత్తాన్ని పెంచేలా ఒప్పందం కుదుర్చుకుంటారని వివరించారు. పీపీపీ పద్దతిలో 25 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు. 23 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్, 80 వేల చ.అ. విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయం ఏర్పాటు చేస్తారని, 6 మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్లతో ఐమ్యాక్స్ థియేటర్, 3 స్టార్ల హోటల్ నిర్మిస్తారని వివరించారు. ఈ ప్రాజెక్టులో వారు ప్రతిపాదించిన రూముల కంటే ఎక్కువ సంఖ్యలో రూములను నిర్మించాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
దీని ఖర్చులను కూడా ఏపీటీడీసీయే భరించి పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు. 42 నాన్ అమృత్ పట్టణాలలో మౌలిక సదుపాయాలు ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల క్రింద ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు పబ్లిక్ హెల్త్, మెడికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సింగిల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా నియమిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
42 నాన్ అమృత్ పట్టణాల స్థానిక సంస్థలలో మౌలిక సదుపాయాల సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యయం కోసం రూ.4,188.71 కోట్లకు పరిపాలనా ఆమోదం లభించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116.99 కోట్లు, ఆయా పురపాలక సంస్థలు రూ.465.41 కోట్లు ఖర్చు చేస్తాయని, ఎక్స్ టెర్నల్ ఏజెన్సీలు రూ.2,066.31 కోట్లు చొప్పున ప్రాజెక్టుకు ఫైనాన్సింగ్ చేస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఏపీయుడబ్ల్యూఎస్ఎస్ఎంఐపీ) కింద ఈ ప్రాజెక్టు చేపడతారని చెప్పారు.
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరుకు ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంటు బ్యాంకుతో వివిధ ఒప్పందాలను చేసుకునే బాధ్యతను అప్పగిస్తూ మంత్రి మండలి తీర్మానించినట్లు తెలిపారు. యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)లో కొత్తగా 350 పోస్టులను భర్తీ చేసేందుకు, అందులో 300 ఖాళీలను నేరుగానూ, మిగిలిన 50 ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టినందున ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూసేందుకు ఏసీబీని బలోపేతం చేయాలని, జాయింట్ డైరెక్టర్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ వరకు వివిధ స్థాయిల్లో ఈ నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ – సీనియర్ సివిల్ జడ్జిల కోర్టు కోసం కొత్తగా 25 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని, ఇందులో సీనియర్ సివిల్ జడ్జి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయని వివరించారు.
శాసన సభాపతికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ని నియమించేందుకు వీలుగా ఒక పోస్టును సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు, ముందుగా ఒక ఏడాది కాలం డిప్యూటేషన్ విధానంలో సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి భర్తీ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విజయవాడ విద్యాధరపురంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు 92 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలోని 44.97 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి ఉచితంగా అందిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసున్నట్లు మంత్రి కాల్వ తెలిపారు.