theatres: సామాన్యుడికి అందుబాటులో సినిమా టిక్కెట్ల ధరలు: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై ప్రభుత్వానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ప్రతిపాదనలు 
  • నగరాలు, పట్టణాల్లో ఉన్న ఏసీ సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలు ఒకే రకంగా ఉండబోవు
  • మరోసారి జరిగే మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సినిమా టిక్కెట్ ధరలపై తుది నిర్ణయం

సామాన్యుడికి వినోదాన్ని అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామని ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు అన్నారు. ఈ రోజు అమ‌రావ‌తిలోని తాత్కాలిక‌ సచివాలయంలోని సెకండ్ బ్లాక్ లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులతో సినిమా టిక్కెట్ల ధరల పెంపు నిర్ణయంపై మంత్రి సమావేశం నిర్వహించారు.

మంత్రివర్గ ఉప సంఘం భేటీకి డిప్యూటీ సీఎం చిన రాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనివార్య కారణాల వల్ల హాజరు కాకపోవడంతో, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు... మంత్రి కాల్వ‌ శ్రీనివాసులుకు కొన్ని ప్రతిపాదనలు అందజేశారు.

నగరాలు, పట్టణాల్లో ఉన్న ఏసీ సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరలు ఒకే రకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు అంగీకరించలేదు. ఆయా ప్రాంతాల వారీగా, ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ల ధరలు నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మధ్య తరగతి, పేదలకు సరసమైన ధరలకు వినోదం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు.

మరోసారి జరిగే మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సినిమా టిక్కెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, సినీ నిర్మాతలు ద‌గ్గుబాటి సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సీ కల్యాణ్ తో పాటు ఎగ్జిబిటర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

theatres
Andhra Pradesh
kalva srinivasulu
rates
  • Loading...

More Telugu News