worship: బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని.. చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు!
- బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలి
- భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించాం
- బ్యాంకులను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు: పూజారులు
గతంలో దేశంలోని బ్యాంకులను మోసం చేసి వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాలకు పారిపోగా, తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో మొండి బకాయిలు వసూలు కాక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సంక్షోభాలన్నీ తొలగిపోవాలని కోరుతూ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ప్రసిద్ధ ఆలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరులో ఉన్న విషయం తెలిసిందే. అక్కడి స్వామి వారిని దర్శిస్తే మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ ఆలయంలో పూజలు చేయించుకుంటే వీసా సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దేశంలో బ్యాంకులు సమస్యల్లో చిక్కుకుంటోన్న నేపథ్యంలో.. బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలని పూజారులు ఈ రోజు పూజలు చేశారు.
అలాగే, విఫలమైన బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించామని పూజారి చెప్పారు.