UP: కరిచిందన్న కోపంతో పామును కరకర నమిలేశాడు!

  • వ్యక్తి శరీరంపై గాట్లు లేకపోవడంతో డాక్టర్లు షాక్
  • మానసిక స్థితి సరిగా లేకే అలా చేశాడన్న వైద్యులు
  • అతన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు

తనను కరిచిందన్న కోపంతో పాము తలను ఓ వ్యక్తి కరకర నమిలేశాడు. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో అతన్ని సమీపంలోని ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని శరీరంపై పాము గాట్లు ఏమీ లేకపోవడం చూసి వైద్యులు షాక్ తిన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌దోయి‌లో జరిగిన ఈ సంఘటన కాస్త ఎబ్బెట్టుగానూ గగుర్పాటు కల్గించేదిగానూ ఉండొచ్చు. కానీ ఇది నిజం. వివరాల్లోకెళితే...

మొఘాగంజ్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లోని ప్రభుత్వ రంగ 108 అంబులెన్స్‌కి శనివారం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో శుక్లాపూర్ భాగర్ గ్రామానికి అంబులెన్స్ చేరుకుంది. అక్కడ స్పృహతప్పి పడిపోయన సోనీలాల్‌ను రాత్రి 7 గంటల ప్రాంతంలో సీహెచ్‌సీకి తరలించారు. అత్యవసర సేవల్లో ఉన్న డాక్టర్ మహేంద్ర వర్మ, ఫార్మాసిస్టు హితేష్ కుమార్ ఈ కేసును టేకప్ చేశారు.

"సోనీలాల్ ఇరుగుపొరుగు వారు రామ్ సేవక్, రామ్ స్వరూప్ ఇద్దరూ అతన్ని పాము కరిచిందని చెప్పారు. దాంతో మేము అతని ఒంటిపై పాము గాట్ల కోసం వెదికాం. అయితే అలాంటి గుర్తులేవీ మాకు కనిపించలేదు" అని హితేష్ చెప్పారు.

ఇదిలా ఉంటే, రాత్రి 10 గంటలకు స్పృహలోకి వచ్చిన సోనీలాల్ జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడని ఫార్మాసిస్టు తెలిపారు. పశువులను మేపుతున్న సమయంలో సోనీలాల్‌ని పాము కరవడంతో అతనికి కోపం వచ్చి దాని తలను కొరికి నమిలేశాడని హితేష్ చెప్పారు. అతని శరీరంపై పాము గాట్లు లేవని, దాని తలను నమలడం వల్లే అందులోని విషం వల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ విషయం గురించి తెలియగానే స్థానికులు అతన్ని చూడటానికి సీహెచ్‌సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. సోనీలాల్ మానసిక స్థితి సరిగా లేనందు వల్లే అతను ఇలా చేశాడని రాష్ట్ర మానసిక ఆరోగ్య సంఘం కార్యదర్శి డాక్టర్ ఎస్‌సీ తివారీ చెప్పారు.

  • Loading...

More Telugu News