Cold: ఫిబ్రవరిలోనే ఎండ మండుతోంది!
- పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- సాధారణం కన్నా రెండు డిగ్రీల అధికం
- మహబూబ్ నగర్ లో 36 డిగ్రీలకు ఎండ వేడిమి
భానుడు అప్పుడే మండుతున్నాడు. మహాశివరాత్రితోనే చలి పులి 'శివ శివా' అంటూ వెళ్లిపోగా, తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెల కూడా ముగియకముందే ఎండలు మండుతుండటంతో ఈ వేసవిలో మరింత అధిక వేడిమి నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక మహబూబ్ నగర్ లో ఏకంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్, రామగుండం తదితర ప్రాంతాల్లో ఎండ వేడిమి 35 డిగ్రీలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విశాఖపట్నం, రెంటచింతల, చిత్తూరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 32 నుంచి 35 డిగ్రీలకు పెరిగింది. ఎండవేడిమి ఇప్పుడే పెరుగుతుండటంపై అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాత్రిపూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, భద్రాచలం, ఖమ్మంలలో 21 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో 20 డిగ్రీలుగానూ నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో కొంత చలితో కూడిన వాతావరణం ఉండాల్సి వుంటుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా పెరుగుతూ ఉండటంతో ఈ వేసవిలో వేడిమిపై ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది.