KCR: గుండు హనుమంతరావును కాపాడుకోవాలని తాపత్రయపడ్డ ఎంతో మంది... ఫలితం దక్కలేదు!

  • సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు ఇచ్చిన కేసీఆర్
  • రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందించిన చిరంజీవి
  • మరెంతో మంది సాయం చేసినా దక్కని ప్రాణాలు

గత కొన్ని సంవత్సరాలుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ, ఈ తెల్లవారుజామున తన స్వగృహంలో తుది శ్వాస విడిచిన టాలీవుడ్ హాస్య నటుడు గుండు హనుమంతరావును కాపాడుకునేందుకు ఎంతో మంది తాపత్రయపడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ, విషయం తెలుసుకున్న కేసీఆర్ స్వయంగా స్పందించి, సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలను చికిత్స నిమిత్తం అందించారు. ఆపై గుండు హనుమంతరావుకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

తరువాత ఆయన పరిస్థితి తెలుసుకుని ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఆర్థిక సాయం చేశారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి రూ. 2 లక్షలు పంపించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివాజీరాజా ఆయనకు ధన సహాయం చేశారు. పలువురు ఇతర నటీనటులు కూడా సాయం చేశారు. అయితే, మూత్రపిండాలు రెండూ పూర్తిగా దెబ్బతినడమే ఆయన మృతికి కారణమని వైద్యులు వెల్లడించారు.

ఆయన ప్రాణాలు ఇక దక్కవని పది రోజుల క్రితమే స్పష్టం చేసిన వైద్యులు, ఇక ఇంటికి తీసుకువెళ్లవచ్చని కుటుంబీకులకు సూచించారు. 2010లో భార్య మరణానంతరం గుండు హనుమంతరావు పూర్తిగా కుంగిపోయారని, సరైన సమయానికి తిండి తినక, ఆమె ఆలోచనల్లోనే గడుపుతూ ఆరోగ్యం పాడుచేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News