Chhattisgarh: అంత్యక్రియలకు డబ్బుల్లేక కొడుకు మృతదేహాన్ని ఆసుపత్రికే అప్పగించిన తల్లి!
- మెడికల్ కాలేజీకి ఇచ్చేయండంటూ మార్చురీ ఇన్‌చార్జి సూచన
- ఎవరూ సాయం చేయలేదని బాధిత కుటుంబం ఆవేదన
- అంత్యక్రియలకు డబ్బుల్లేకనే ఇలా చేశామని వెల్లడి
చేతిలో డబ్బుల్లేక... కష్టాల్లో ఆదుకునే వారు లేక చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ చనిపోయిన తన కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించలేకయింది. తమ స్వస్థలానికి తీసుకెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేక చివరకు ఆమె తన కుమారుడి భౌతికకాయాన్ని జగ్‌దల్‌పూర్ వైద్య కళాశాలకు అప్పగించింది. తమకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని మృతుడి వదిన ఆవేదన చెందింది.
"మేం నిరుపేదలం. మృతదేహాన్ని తీసుకుపోలేని దయనీయ పరిస్థితి మాది. అంత్యక్రియలు నిర్వహించలేని నిస్సహాయులం. అందుకే, దాని గురించి ఆలోచిస్తుండగా, ఆ సమయంలో ఆసుపత్రి మార్చురీ వద్ద ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించమని సలహా ఇచ్చాడు" అని ఆమె మీడియాకి తెలిపింది.
సదరు వైద్య కళాశాల మార్చురీ ఇన్‌చార్జి మంగళ్ సింగ్ మాట్లాడుతూ, చనిపోయిన వ్యక్తి కుటుంబం చాలా పేద కుటుంబమని, అందుకే వారికి ఇష్టమైతే మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించమని సూచించానని ఆయన చెప్పారు. ఈ నెల 12న మృతుడు బామన్‌ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఇదే నెల 15న అతను కన్నుమూశాడు.