Hyderabad: మహిళకు లైంగిక వేధింపులు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్టు!
- హైదరాబాద్ లోని ఓ సంస్థలో పని చేస్తున్న హేమంత్ కుమార్
- ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర మెస్సేజ్ లు
- బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్టు
ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బండ్ల హేమంత్ కుమార్ (24) కొంత కాలంగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఉంటూ, ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
హేమంత్ కుమార్ పదో తరగతి చదువుకునే సమయంలో సహ విద్యార్థినితో ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు. 2012లో ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత బండ్ల ప్రియాంక పేరిట ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాను హేమంత్ తెరిచాడు. ఆ ఖాతా ద్వారా ఆమెకు అసభ్యకర మెస్సేజ్ లు పంపిస్తూ ఉండేవాడు. దీంతో, సైబర్ క్రైం పోలీసులను బాధితురాలు ఆశ్రయించి, ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టి, ఐపీ వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.