Hafiz Saeed: భారత్ మెప్పు కోసమే ఇదంతా!: పాక్ సర్కార్‌పై హఫీజ్ ధ్వజం

  • ప్రభుత్వ చర్యతో తమ సహాయక చర్యలకు ఇబ్బందని ఆవేదన
  • ప్రభుత్వ చర్యపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటన
  • హింసకు పాల్పడవద్దని అనుచరులకు హితవు

భారత్, అమెరికాల మెప్పు కోసమే పాకిస్థాన్ ప్రభుత్వం తమ సంస్థలపై ఉక్కుపాదం మోపిందని ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ధ్వజమెత్తాడు. ప్రభుత్వ అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని అతను స్పష్టం చేశాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ నలువైపుల నుండి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో పాకిస్థాన్ సర్కార్ సయీద్‌కి సంబంధించిన జమాత్ ఉద్ దవా (జుద్), ఫలాహ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పాఠశాలతో పాటు నాలుగు ఆరోగ్య కేంద్రాలను తన నియంత్రణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎలాంటి కారణం లేకుండానే పాకిస్థాన్ ప్రభుత్వం పది నెలల పాటు తనను గృహనిర్బంధంలో ఉంచడమే కాక తన ఆధ్వర్యంలో  నడుస్తున్న సంస్థలను స్వాధీనం చేసుకుందని అతను మండిపడ్డాడు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఎలాంటి హింసకు పాల్పడవద్దని, సంయమనంతో వ్యవహరించాలని తన అనుచరులకు అతను సూచించాడు.

కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీర్మానాలను భారత్ పట్టించుకోదని, కానీ పాకిస్థాన్ పాలకులు మాత్రం జుద్, ఎఫ్ఐఎఫ్ లాంటి దేశభక్త సంస్థలపై చర్యలకు ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను జారీ చేశారని అతను దుయ్యబట్టాడు. ప్రభుత్వ చర్య వల్ల పంజాబ్, బలూచిస్థాన్, సింధ్, ఆజాద్ కశ్మీర్, ఉత్తర ప్రాంతాల్లో తమ సహాయక చర్యలపై ప్రభావం పడుతుందని అతను ఆవేదన చెందాడు. కాగా, ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు సుమారు 2 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలపై చర్యలకు పాకిస్థాన్ ఉపక్రమించడం గమనార్హం.

Hafiz Saeed
Pakistan
Jamaat-ud-Dawa
Falah-i-Insaniat Foundation
  • Loading...

More Telugu News