amaravati: అతి త్వరలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేలా ఉంది: చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు

  • అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
  • హక్కుల సాధన కోసం రాజీలేని పోరు
  • జగన్ చేసేదంతా కేసుల మాఫీ కోసమే
  • కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఈ సంవత్సరం బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినట్టే ఏపీకి కేటాయింపులు ఇచ్చారే తప్ప, విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రమని ఎంతమాత్రమూ ఆదుకునే ప్రయత్నం జరగలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకత ఏమీ లేదని, హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేయాల్సి వుంటుందని టీడీపీ నేతలతో ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితులను చూస్తుంటే అతి త్వరలోనే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేలా ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును ప్రకటిస్తారని మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి తెలియక ముందే విషయం జగన్ కు చేరిపోయిందని, ఆయన ముందే వెళ్లి ఫొటో దిగారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బీజేపీ వారు అడక్కుండానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతిచ్చారని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడుతుంటే, జగన్ ఏది చేసినా కేసుల మాఫీ లాలూచీ కోసమేనని విమర్శిస్తూ, పైగా తానేదో కేసులకు భయపడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసులు పెడితే ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారని, మనపై పెట్టిన కేసులన్నింటికీ క్లీన్ చిట్ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News