Vishva Hindu Parishad: యువతకు ప్రేమించే హక్కుంది: తొగాడియా ప్రేమికుల రోజు సందేశం
- ప్రేమలో పడకుంటే పెళ్లిళ్లు జరగవని వ్యాఖ్య
- మన కుమార్తెలు, చెల్లెళ్లకూ ప్రేమించే హక్కుందని స్పష్టీకరణ
- వేలంటైన్స్ డే ముందుగా కార్యకర్తలకు దిశానిర్దేశం
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కార్యకర్తలు ప్రేమికుల రోజును మనదేశంలో నిర్వహించుకోవడాన్ని కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో వేలంటైన్స్ డే ఉన్నందున వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఈ సందర్భంగా యువతకు ఇచ్చిన సందేశం ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. యువతీయువకులకు ప్రేమించే హక్కు ఉందని ఆయన అన్నారు. ప్రేమికుల రోజున ఆందోళనలు లేదా హింస ఉండరాదని ఆయన కోరారు. చండీగఢ్‌లో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
'జంటలు ప్రేమలో పడకుంటే, పెళ్లిళ్లు జరగవు. అలా పెళ్లిళ్లు లేకుంటే ప్రపంచం పురోగతి సాధించదు. అందువల్ల యువతీయువకులకు ప్రేమించే హక్కుంది. వారు ఈ హక్కును పొందాలి' అంటూ ఆయన సందేశమిచ్చారు. ప్రేమికుల రోజు నాడు తమ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేపట్టకుండా వారికి తగిన ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు. తమ కుమార్తెలు, సోదరీమణులకు కూడా ప్రేమించే హక్కుందంటూ సందేశపూర్వకంగా తెలిపామన్నారు. కాగా, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు కొన్నేళ్లుగా భారత్‌లో ప్రేమికుల రోజును నిషేధించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.