Pawan Kalyan: పవన్ కల్యాణ్ గౌరవాన్ని నిలబెడతానంటూ మాట ఇచ్చా!: వెంకీ అట్లూరి

  • 'ముకుంద' సినిమా సమయంలోనే కథను రెడీ చేసుకున్నా
  • 'లోఫర్' షూటింగ్ సమయంలో వరుణ్ కు వినిపించా
  • దిల్ రాజు బిజీగా ఉండటంతో.. బాపినీడుకు కథను వినిపించా

పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా గౌరవాన్ని కాపాడతానంటూ ఆయన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపాడు. వరుణ్ తేజ్, రాశీఖన్నాలు జంటగా ఆయన దర్శకత్వం వహించిన 'తొలిప్రేమ' సినిమా విజయవంతంగా ఆడుతోంది.

ఈ నేపథ్యంలో వెంకీ మాట్లాడుతూ, తాను ఈ కథను రెడీ చేసుకునే సమయానికి 'ముకుంద' సినిమా ఇంకా విడుదల కాలేదని, కేవలం టీజర్ మాత్రమే విడుదలైందని.. టీజర్ చూసిన తర్వాత వరుణ్ అయితే ఈ సినిమాకు బాగుంటుందని అనుకున్నానని చెప్పాడు. 'కంచె' సినిమా చూశాక వెరైటీ సినిమాలు చేసేందుకు వరుణ్ సిద్ధంగా ఉన్నాడని తనకు అనిపించిందని తెలిపాడు.

'లోఫర్' షూటింగ్ సమయంలో వరణ్ కు ఈ కథను వినిపించానని వెంకీ చెప్పాడు. వాస్తవానికి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాల్సి ఉందని... అయితే, ఆయన బిజీగా ఉండడంతో నిర్మాత బీవీఎస్ఎం ప్రసాద్ తనయుడు బాపినీడుకు కథను వినిపించానని... ఆయనకు కూడా కథ నచ్చడంతో, సినిమా పట్టాలెక్కిందని తెలిపాడు.

కథ మీద తనకున్న నమ్మకంతోనే ముందుకు వెళ్లానని... పవన్ కల్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా సినిమా తీయాలనుకున్నానని చెప్పాడు. ప్రేక్షకుల స్పందన చూశాక... అనుకున్నదాని కన్నా విజయవంతమైందనే ఆనందం కలిగిందని తెలిపాడు. కేటీఆర్ గారు కూడా సినిమా బాగుందంటూ ట్వీట్ చేయడం సంతోషం కలిగించిందని చెప్పాడు.  

Pawan Kalyan
varuj tej
venky atluri
tholiprema movie
  • Loading...

More Telugu News