Ramgopal Varma: పనిలేని వర్మ... కామెంట్లపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందన!

  • పార్లమెంట్ ముందు వినూత్న నిరసన తెలిపిన శివప్రసాద్
  • జోకర్లతో పోల్చిన దర్శకుడు వర్మ
  • ఆయనేదైనా ఐడియా ఇస్తే చేస్తానన్న శివప్రసాద్
  • పనిలేని కామెంట్లను పట్టించుకోబోనని వెల్లడి

పార్లమెంట్ ముందు ఎంపీల ధర్నా, అఘోరా వేషంలో నిరసన తెలిపిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఫోటోను షేర్ చేస్తూ, వారిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జోకర్లతో పోల్చగా, శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, తనను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, పేకాటలో జోకర్ కు ఎంత విలువ ఉందో తెలియదా? అని అడిగారు. పార్లమెంట్ లో 28 రాష్ట్రాల సమస్యలు వస్తుంటాయని, వాటన్నింటినీ పక్కన బెట్టి, అందరి దృష్టినీ ఏపీ వైపు తిప్పాలంటే, కేవలం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తే సరిపోదని అన్నారు.

అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రవర్తించాల్సిందేనని అన్నారు. సెక్రటరీ జనరల్ దగ్గర ఉన్న రూల్స్ బుక్స్ తీసుకుని తాను పరిగెత్తిన తరువాతనే సభను వాయిదా వేశారని, తన ఉద్దేశం సభ జరుగనీయకుండా చూడటమేనని, అంతకన్నా తనకు మరో ఉద్దేశం లేదని చెప్పారు. తానేమీ నేరం చేయలేదని అన్నారు. ఏ విధంగా వాయిదా వేయించాలన్నదే తన ఆలోచనని అన్నారు. తాము ఇంకా ఏమి చేస్తామోనన్న భయంతోనే కేంద్రం విభజన హామీల అమలుకు కదిలిందని అన్నారు.

తాము రాష్ట్రం కోసం ఎంతో చేస్తుంటే, వర్మ కామెంట్లు ఏంటని ప్రశ్నించిన శివప్రసాద్, ఆయనిచ్చిన బిరుదులపై బాధపడటం లేదని, ఎవరు ఏమనుకున్నా తాను ఆగనని చెప్పారు. పనిలేని వర్మలాంటి వాళ్లు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నరేంద్ర మోదీని ఇంకా నమ్మే పరిస్థితి లేదని, తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు చేపట్టిన నిరసనల వల్లే జాతీయ మీడియా దృష్టంతా రాష్టం వైపు పడిందని అన్నారు. తమను విమర్శించడం ద్వారా మరో విధమైన ప్రచారాన్ని వర్మ కోరుకుంటున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. అలా కాకుండా, ఆయన తన తెలివిని ఉపయోగించి ఓ ఐడియా ఇస్తే, తాను చేస్తానని చెప్పారు.

Ramgopal Varma
Siva Prasad
Twitter
  • Loading...

More Telugu News