hollywood: అది స్టంట్ కాదు... నన్ను చంపేందుకు వేసిన స్కెచ్: హాలీవుడ్ నటి ఉమ థర్మన్ ఆరోపణ
- 'కిల్ బిల్' చిత్రీకరణ సందర్భంగా యాక్సిడెంట్
- ఆ యాక్సిడెంట్ ను హార్వీ వెయిన్ స్టీన్ చేయించాడన్న ఉమ థర్మన్
- తన జీవితంలో జరిగిన అతి పెద్ద తప్పన్న దర్శకుడు క్వెంటిన్
క్వెంటిన్ టరంటీనో దర్శకత్వంలో తాను నటించిన ‘కిల్ బిల్’ (2003) సినిమా షూటింగ్ సందర్భంగా స్టంట్ పేరుతో హార్వే వెయిన్ స్టీన్ తనను చంపేందుకు స్కెచ్ వేశాడని ప్రముఖ హాలీవుడ్ నటి ఉమ థర్మన్ ఆరోపించింది. 'మీటూ' ఉద్యమంలో భాగంగా హార్వీ వెయిన్ స్టీన్ తనను కూడా లైంగికంగా వేధించాడని చెప్పిన ఉమ థర్మన్, ఆ తరువాత జరిగిన హత్యాయత్నం గురించి వెల్లడించింది.
స్టంట్ షూట్ లో భాగంగా అడవిలో ఉన్న ఒక రోడ్ మీద వేగంగా కారు నడుపుతూ వెళ్లాలని, గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ చెట్ల మధ్యలోంచి దూసుకెళ్తోన్న తాను సడెన్ గా వచ్చిన మలుపును చూసి కారును కంట్రోల్ చేయలేక ఆ పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టానని గుర్తుచేసుకుంది.
ఈ ప్రమాదంలో తన రెండు మోకాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పింది. ఉదర భాగానికి స్టీరింగ్ గట్టిగా ఢీ కొట్టడంతో ప్రాణం పోయిందని భావించానని తెలిపింది. అయితే అదృష్టవశాత్తు బతికి బట్టకట్టానని పేర్కొంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగి 15 ఏళ్లైనా ఆ గాయాలింకా తనను వేధిస్తున్నాయని చెప్పింది. తన యాక్సిడెంట్ కు సంబంధించిన పుటేజ్ ఇవ్వమని కోరినా వెయిన్ స్టీన్ వాటిని తనకు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. స్టంట్ మేన్ తో దానిని చేయించమని చెప్పినా దర్శకుడు ఒప్పుకోలేదని, దీనిని బట్టి తనను చంపడానికి వేసిన స్కెచ్ గా దీనిని భావిస్తున్నానని ఆమె పేర్కొంది.
ఈ క్రమంలో రోస్ మెక్ గొవాన్ చొరవతో హార్వీ వెయిన్ స్టీన్ వేధింపులు బయటకు వచ్చి, 'మీటూ' ఉద్యమం ప్రారంభం కావడంతో ఆమె తనపై జరిగిన వేధింపులు, హత్యాయత్నాన్ని బయటకు చెప్పగలిగింది. కాగా, దీనిపై ఆ సినిమా డైరెక్టర్ క్వెంటిన్ టరంటీనో మాట్లాడుతూ, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఆ స్టంట్ చిత్రీకరణేనని పేర్కొన్నాడు. ఆ రోడ్డు తిన్నగా ఉందని భావించానని, మలుపు ఉందని ఊహించలేదని చెప్పాడు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదేనని చెబుతూ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆ నాటి యాక్సిడెంట్ విజువల్స్ ను ఆమెకు స్వయంగా పంపాడు.