Tucson Airport Authority: ఎయిర్‌పోర్టు బాత్రూమ్‌లో జననం... అనాథగా పసిగుడ్డు!
- టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- బొడ్డుతాడుతో జన్మించిన శిశువు... రక్తస్రావం కాకుండా క్లాంప్ బిగింపు
- బిడ్డకు తాను సరైన తల్లిని కాదంటూ రాసిన నోటు లభ్యం
అమెరికాలోని టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నిఘా కెమేరాలో గర్భవతిగా కనిపించిన ఓ మహిళ కొద్ది సేపటికే మామూలు మనిషిలా వెళ్లిపోవడం రికార్డయింది. జనవరి 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోతో పాటు కొంత సమాచారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు విడుదల చేశారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ఎయిర్ పోర్టు బాత్ రూమ్‌లో అప్పుడే పుట్టిన నవ శిశువును ఆమె వదిలి వెళ్లిపోయింది. ఆ మగశిశువుతో పాటు మరో నోటును ఓ అద్దె వాహనాల సంస్థ ఉద్యోగి గుర్తించారు. ఆ నోటులో "నా బిడ్డ ఉత్తమమైన చోటుకి చేరుకోవాలని నేను కోరుకుంటున్నా. అది నేనైతే కాదు. దయచేసి నన్ను క్షమించగలరు" అని రాసుంది.
"దయచేసి నాకు సాయం చేయండి. ఏం చేయాలన్నది నా తల్లికి తెలియదు. ఆమె నా సంరక్షణ బాధ్యతను చూడలేని అయోగ్యురాలు. నాకొక చక్కటి ఆధారం చూపించగల సంస్థల వద్దకు నన్ను చేర్చగలరు" అని శిశువు వద్ద లభించిన నోటులో రాసుంది. బొడ్డుపేగుతో పుట్టడంతో ఆ శిశువుకు రక్తస్రావం జరగకుండా దానికి ఒక కొక్కెంను కూడా బిగించి ఉందని ఎయిర్ పోర్టు పోలీసులు విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
బాలింతల కోసం అరిజోనా ప్రభుత్వం తీసుకొచ్చిన 'బేబీ మోసెస్' చట్టం నవజాత శిశువులను ఆసుపత్రులు, అగ్నిమాపకదళ కేంద్రాలు లాంటి నిర్దేశిత ప్రదేశాల్లో వదిలివెళ్లడానికి అవకాశం కల్పిస్తుంది. ఇందుకు సదరు మహిళలకు ఎలాంటి జరిమానా ఉండదని చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇలాంటి నిబంధనల వల్లే ఆమె ఈ పని చేసుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మగశిశువు ప్రస్తుతం అరిజోనా పిల్లల సంరక్షణ శాఖ సంరక్షణలో ఉన్నాడు.