governor: చిన్నతనంలో విద్యార్థులపై ఈ నలుగురి ప్రభావం ఉంటుంది: గవర్నర్ నరసింహన్

  • రాజ్ భవన్ గవర్నమెంట్ హైస్కూల్ వార్షికోత్సవాలు
  • ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసింహన్
  • తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది
  • ఉపాధ్యాయులే విద్యార్థులకు రోల్ మోడల్స్: నరసింహన్

తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు, స్నేహితులు.. ఈ నలుగురి ప్రభావం చిన్నారి విద్యార్థులపై తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో రాజ్ భవన్ గవర్నమెంట్ హైస్కూల్ వార్షికోత్సవాలు ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, సమాజానికి అందించాల్సిన బాధ్యత ఈ నలుగురిపై ఉంటుందని అన్నారు.

తమ పిల్లలకు సత్ప్రర్తన, పెద్దలను, మహిళలను ఎలా గౌరవించాలనే అంశాలను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని, మంచి వాతావరణంలో పిల్లలను పెంచాలని అన్నారు. ఈ విషయాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు కనుక, చాలా బాధ్యతగా తల్లిదండ్రులు వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. ముఖ్యంగా, తల్లిదండ్రుల ప్రవర్తన తమ పిల్లలపై చాలా ప్రభావం చూపుతుందని అన్నారు.

పాఠశాల అనేది దేవాలయంతో సమానమని, ఉపాధ్యాయులను రోల్ మోడల్స్ గా విద్యార్థులు భావిస్తారని అన్నారు. కనుక, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంటుందని, ఒక విద్యార్థిని మరో విద్యార్థితో పోల్చవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్ భవన్ గవర్నమెంట్ హైస్కూల్ ఐదు దశాబ్దాల నాటిదని, ప్రస్తుతం దీనిని రాష్ట్రంలో మోడల్ స్కూల్ గా గుర్తించారని అన్నారు. ఈ సందర్భంగా పలు పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News