India: పాలస్తీనాలో ప్రధాని మోదీకి ‘గ్రాండ్ కాలర్’తో అరుదైన గౌరవం
- అత్యంత గౌరవ పురస్కారంతో మోదీని సన్మానించిన అధ్యక్షుడు అబ్బాస్
- భారత్-పాలస్తీనా దేశాల మధ్య మైత్రికి చిహ్నం ఈ సన్మానం
- పాలస్తీనాను సంపూర్ణ స్వతంత్ర దేశంగా చూడాలని భారత్ ఆకాంక్షిస్తోంది : ప్రధాని మోదీ
పాలస్తీనా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భారత్ - పాలస్తీనా దేశాల మధ్య సత్సంబంధాలను కొనసాగించడంలో మోదీ కీలక పాత్ర పోషించడంపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ దేశం తరపున ఇచ్చే అత్యంత గౌరవ పురస్కారం ‘గ్రాండ్ కాలర్’, ప్రశంసాపత్రాలతో మోదీని మహ్మద్ అబ్బాస్ సన్మానించారు. కాగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. అనంతరం, మోదీని ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్-పాలస్తీనా దేశాల మధ్య మైత్రికి చిహ్నం ఈ సన్మానం అని, ప్రతి భారత పౌరుడి తరపున తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పాలస్తీనాను సంపూర్ణ స్వతంత్ర దేశంగా చూడాలని భారత్ ఆకాంక్షిస్తోందని అన్నారు. ఈ పర్యటనలో రెండు దేశాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసి తాను ఎంతో సంతోషపడుతున్నానని అన్నారు. ఈ ఏడాది నుంచి భారత్ కు వచ్చే పాలస్తీనా విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 100కు పెంచుతున్నట్టు మోదీ ప్రకటించారు.
‘గ్రేట్ కాలర్’ గురించి చెప్పాలంటే..
పాలస్తీనాలో ఉన్నత సేవలందించిన ప్రభుత్వ అధికారులు లేదా ఆ స్థాయి వ్యక్తులు, విదేశీ ప్రముఖులు, దేశాల రాజులను ‘గ్రాండ్ కాలర్’ హారంతో సన్మానిస్తారు. ఇప్పటి వరకు ఈ అత్యున్నత పురస్కారాన్ని సౌదీ అరేబియా రాజు సల్మాన్, బహ్రెయిన్ రాజు హమాద్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కు బహూకరించారు. ప్రధాని హోదాలో పాలస్తీనాను సందర్శించిన మొట్టమొదటి ప్రధాన మంత్రి మోదీకి ఈ అరుదైన గౌరవం లభించింది.