Andhra Pradesh: ఏపీలో 12 నుంచి 'జల సంరక్షణ' ఉత్సవం!

  • 116 రోజులు నీరు ప్రగతి - జల సంరక్షణ  ఉద్యమం
  • జూన్ లో నీటి సంఘాలకు ఎన్నికలు
  • సమావేశంలో మంత్రి దేవినేని ఉమ వెల్లడి

నీరు ప్రగతి - జలసంరక్షణ రెండో విడత ఉద్యమ కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో ఈరోజు సాయంత్రం నీరు - ప్రగతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీరు - చెట్టు పనుల ప్రగతిని సమీక్షించారు. వచ్చే ఏడాదికి రూపొందించిన పనుల  ప్రణాళికపైన, జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే పనులపైనా చర్చించారు. చేపట్టిన పనులను, పూర్తి చేసిన పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన
పనులను త్వరగా ముగించాలని ఆదేశించారు. కడప జిల్లాలో చెక్ డ్యామ్ ల నిర్మాణం బాగుందని, అక్కడ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అక్కడి అభివృద్ధిని పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జూన్ లో నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లు పనుల విషయమై శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడారు. నీటి సంఘాల భాగస్వామ్యంతో జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే చెరువుల మరమ్మతులు, చెరువుల అనుసంధానం, కాలువల్లో పూడిక తొలగింపు, చెక్ డ్యామ్ ల నిర్మాణం, ఊట గుంటల నిర్మాణం, నేలలో తేమ పెంపు పనులు, వాననీటి సంరక్షణ, కాంటూర్ కందకాలు, రాక్ ఫిల్ డ్యామ్స్, అటవీ సరిహద్దు కందకాలు, భూగర్భజలాల పెంపు, ఊరూరా జలగణన, ఇతర జల సంరక్షణ నిర్మాణాలపై చర్చించారు. పెరిగిన భూముల సాగు, పంటల విస్తీర్ణం, సాగు నీరు, నివాస ప్రాంతాలకు త్రాగునీరు, వనసంరక్షణ సమితులు, ఫారం ఫాండ్స్, బోర్ వెల్స్ రీఛార్జి, చెరువులలో నీటి నిల్వ, వాటర్ షెడ్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వర్షాలు పడిన వెంటనే నీరు భూమిలో ఇంకే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News