rtgs: ఆర్టీజీఎస్ పనితీరుపై నీతి ఆయోగ్ సభ్యులు రమేశ్ చంద్ ప్రశంసలు
- తొమ్మిది నెలల కాలంలో పరిష్కార వేదిక ద్వారా 1,48,50,297 ఫిర్యాదులు
- వాటిని ఎలా పరిష్కరిస్తుందో వివరించిన ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
- అందులో 93 శాతం ఫిర్యాదులు పరిష్కరించాం
- సమస్య పరిష్కరం తరువాత ఫిర్యాదుదారుకు ఫోన్ చేసి వారి అభిప్రాయాల సేకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్ చంద్ కితాబిచ్చారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ రోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అహ్మద్ బాబు ఆర్టీజీఎస్ పనితీరును వివరించారు.
రియల్ టైమ్ ప్రజలకు, ప్రభుత్వానికి ఈ కేంద్రం సేవలు అందిస్తోన్న తీరును తెలియజేశారు. పరిష్కార వేదిక 1100 కాల్ సెంటర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎలా పరిష్కరిస్తుందో వివరించారు. తొమ్మిది నెలల కాలంలో పరిష్కారవేదిక ద్వారా 1,48,50,297 ఫిర్యాదులు స్వీకరించామని అందులో 93 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. సమస్య పరిష్కారం తరువాత ఫిర్యాదుదారుకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయి ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు వివరించారు. ఈ-ఆఫీసు పనితీరు, కోర్ డ్యాష్‌బోర్డు గురించి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ కెమెరాల ద్వారా ఎలా పర్యవేక్షిస్తున్నది కూడా సీఈఓ బాబు వివరించారు. నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, టెక్నాలజీ వినియోగం వినూత్న ఆలోచనలతో దూసుకెళుతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఏపీలో ఉన్న ఆర్టీజీఎస్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయం కావాలని అన్నారు.