Madhya Pradesh: పాలకు ఏడుస్తోందని పసిపాప గొంతుకోసిన తల్లి..!
- వంట పనుల్లో విసుగుతో గృహిణి దారుణం
- చంపాక భయంతో బంధువుల ఇంటికి పరార్
- రక్తపుమడుగులోని శిశువును చూసి జనాల షాక్
మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పాల కోసం పాప గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూనే ఉందన్న చిరాకుతో ఓ తల్లి తన ఏడాది బిడ్డను గొంతుకోసిన ఘటన హృదయాన్ని కలచివేసింది. ఈ ఘటన జరిగినపుడు అక్కడ ఆమె తప్ప మరెవ్వరూ లేరని, ధర్లోని ఓ గ్రామానికి చెందిన ఆమెను గురువారం అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.
పోలీసుల అందించిన వివరాల ప్రకారం... గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న పాప హఠాత్తుగా ఏడుపు ఆపేసింది. కొద్దిసేపటికే సదరు మహిళ ఇంటికి తాళం వేసుకుని, బిడ్డ లేకుండానే బయటకు వెళ్లిపోయింది. ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లింది. మరో బంధువు ఏదో ఘోరం జరిగిందన్న అనుమానంతో ఇరుగుపొరుగు వారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లింది.
ఇంటిలో రక్తపు మడుగుల్లో పడి ఉన్నశిశువును చూసి అందరూ నిర్ఘాంతపోయారు. "బిడ్డ పాల కోసం ఏడుస్తోంది. తల్లి వంటింట్లో పనిచేసుకుంటోంది. ఏడుపు విని ఆమె విసుక్కుంది. సహనం కోల్పోయింది. వంటింట్లోని కత్తిని తీసుకుని బిడ్డ గొంతుకోసింది" అని పోలీసు అధికారి సిబి సింగ్ తెలిపారు.