Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో అత్యంత ధనికుల్లో నెంబర్‌వన్ 'క్రిస్ లార్సన్'!
- విపుల్ సహ వ్యవస్థాపకుడి సంపద 8 బిలియన్ డాలర్లు
- తర్వాతి స్థానాల్లో జోసెఫ్ లుబిన్, చాంగ్‌పెంగ్ ఝావో
- క్రిప్టోకరెన్సీలు త్వరలోనే జీరో అంటోన్న గోల్డ్‌మన్ సాచ్స్
ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా ప్రకటించిన క్రిప్టోకరెన్సీ అత్యంత ధనికుల్లో విపుల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. ఆయన క్రిప్టోకరెన్సీ నికర సంపద విలువ మొత్తం 7.5 బిలియన్ల నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇందులో అధిక భాగం రిపుల్ కంపెనీ చలామణిలో చేస్తున్న క్రిప్టోకరెన్సీ 'ఎక్స్‌ఆర్‌పి' రూపంలోనే ఉండటం గమనార్హం. లార్సన్ మొత్తంగా 5.19 బిలియన్ల ఎక్స్‌ఆర్‌పిని కలిగి ఉండటం ద్వారా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ని సైతం పక్కకు నెట్టి ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరుగా నిలిచారు.
లార్సన్ సంపద ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం గతేడాది ఆఖర్లో ఎక్స్‌ఆర్‌పి విలువు అమాంతం పెరిగిపోవడమే. ఇక ఎథిరియమ్ సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ లుబిన్ 1 బిలియన్ నుండి 5 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలోనూ, టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ ఝావో 1.1 బిలియన్ల నుండి 2 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలోనూ నిలిచారు.
మరోవైపు ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ బిలియనీర్లుగా వెలుగులోకి వచ్చిన జెమిని సంస్థ సహ వ్యవస్థాపకులు కేమరూన్, టైలర్ వింక్లీవోస్, బ్యాంకింగ్ రంగానికి చెందిన స్వతంత్ర పెట్టుబడిదారు మాథ్యూ మెల్లోన్ వరుసగా తర్వాత స్థానాలను ఆక్రమించారు. కేమరూన్, టైలర్ వింక్లీవోస్ నికర సంపదను 900 మిలియన్ డాలర్ల నుండి 1.1 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. మెల్లోన్ నికర సంపదను 900 మిలియన్ డాలర్ల నుండి 1 బిలియన్ డాలర్లుగా మదింపు వేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 రకాల క్రిప్టోకరెన్సీలు చలామణిలో ఉన్నాయని, 2017 ప్రారంభం మొదలుకుని వీటి మొత్తం విలువ 31 రెట్ల మేర పెరిగి 55 వేల కోట్ల డాలర్ల (రూ.35,75,000 కోట్లు)కు చేరుకుందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.
అయితే, అడ్డూఅదుపూ లేకుండా దూసుకుపోతోన్న క్రిప్టోకరెన్సీల విలువ త్వరలోనే జీరో అవుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ జోస్యం చెబుతోంది. ఈ ఊహాజనిత కరెన్సీ మార్కెట్‌ను 1990వ దశకం చివర్లో వచ్చిన ఇంటర్నెట్ సంక్షోభంతో పోల్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న క్రిప్టోకరెన్సీలు దీర్ఘకాలం పాటు మనుగడ సాగించలేవని, వీటికి ప్రత్యామ్నాయాలు రాగానే ఇవన్నీ కనుమరుగైపోతాయని గోల్డ్‌మన్ సాచ్స్ పరిశోధనా విభాగం అధిపతి స్టీవ్ స్ట్రాంగిన్ పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. లావాదేవీలు నెమ్మదిగా జరగడం, భద్రతా సవాళ్లు పెరిగిపోవడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల ఈ కరెన్సీలకు త్వరలోనే గడ్డుకాలం రాగలదని ఆయన అన్నారు.