Afzal Guru: అఫ్జల్ గురు ఉరికి నేటితో ఐదేళ్లు.. జమ్ముకశ్మీర్‌లో హై అలెర్ట్

  • ఫిబ్రవరి 9న పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి
  • ప్రతీకారం కోసం రగిలిపోతున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ
  • ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
  • అప్రమత్తమైన పోలీసులు

పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడి నేటితో ఐదేళ్లు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిబ్రవరి 9, 11 తేదీలు కశ్మీరీలకు చాలా ముఖ్యమైన రోజులని, కాబట్టి ఆ రోజుల్లో తాము మరింత అప్రమత్తంగా ఉంటామని జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్‌పీ వేద్ తెలిపారు. ఫిబ్రవరి 9న అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుకాగా, 11, 1984లో జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్‌కు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు భారత జైలులో ఉన్న మసూద్ అజర్‌ను విడిపించుకెళ్లారు. జైలు నుంచి బయటకొచ్చిన మసూద్ అజర్ ఆ వెంటనే 2000 సంవత్సరంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత 2014లో అఫ్జల్ గురుతో కలిసి అజర్ జమ్ముకశ్మీర్ ప్రచారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ‘అఫ్జల్ గురు స్క్వాడ్’ను సిద్ధం చేశాడు. నవంబరు 25, 2015లో కుప్వారాలో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో అఫ్జల్ గురును దోషిగా తేల్చిన న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఫిబ్రవరి 9న ఆయనను ఉరితీశారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడంతో ఉడికిపోతున్న జేషే మహమ్మద్ సంస్థ ప్రతి సంవత్సరం దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం లోయలో 22 మంది జైషే ఉగ్రవాదులు ఉండగా వారిలో 15 మంది దక్షిణ కశ్మీర్‌కు చెందిన వారే.

  • Loading...

More Telugu News