parliament: సేమ్ ప్లేస్, సేమ్ డిమాండ్... నిన్న టీడీపీ, నేడు వైసీపీ అంతే తేడా!

  • గాంధీ విగ్రహం ముందు నిన్న, మొన్న టీడీపీ ధర్నా
  • అక్కడే నేడు వైఎస్ఆర్ సీపీ ఎంపీల ధర్నా
  • ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసిన ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించాలని, విభజన తరువాత జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ ఉదయం పార్లమెంట్ లో ధర్నా నిర్వహించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు.

 నిన్న, మొన్న అదే ప్రాంతంలో తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిలబడి, బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. నేడు అదే ప్రాంతంలో వైసీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసనలు తెలిపేందుకు గాంధీ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

 కాగా, మరోవైపు లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రాజ్యసభ చైర్మన్ సీట్ ముందు నిలబడే తన నిరసనను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నేడు కూడా అదే విధంగా ప్లకార్డు పట్టుకుని నిలబడ్డారు.

  • Loading...

More Telugu News