gali muddukrishnamanaidu: మాజీ మంత్రి, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి!
- 1983లో ఎన్టీఆర్ పిలుపుతో అధ్యాపక వృత్తిని వదిలి రాజకీయ రంగ ప్రవేశం
- రికార్డు స్థాయిలో పుత్తూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) గత అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు. కాగా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు.
విద్యాభ్యాసం తరువాత అధ్యాపక వృత్తిని స్వీకరించిన ఆయన, 1983లో దిగ్గజ నటుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయరంగప్రవేశం చేశారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. ఈ క్రమంలో ఆయన వివిధ పదవులను అలంకరించారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సినీ నటి రోజా చేతిలో ఓటమిపాలయ్యారు.ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మృతితో టీడీపీ ఒక సీనియర్ నేతను కోల్పోయింది. ఆయన మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమ అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.