central finance ministry: కేంద్రం నుంచి ఏపీ సీఎంఓకు ఫోన్ కాల్ !
- ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ బయల్దేరి రావాలి
- రెవెన్యూ లోటు, స్పెషల్ ప్యాకేజీపై చర్చిద్దామన్న కేంద్రం
- ఢిల్లీ బయలుదేరిన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్
కేంద్ర బడ్జెట్ లో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ ఉభయసభల్లో టీడీపీ నేతలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ తాజా పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తక్షణం ఢిల్లీకి బయలు దేరి రావాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది.
ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. రెవెన్యూ లోటు, స్పెషల్ ప్యాకేజీపై చర్చించేందుకు పూర్తి సమాచారంతో రావాలని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఈ మేరకు కోరినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు ఢిల్లీ బయలుదేరినట్టు తెలుస్తోంది.