anupam kher: అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ఖాతా హైజాక్... ‘ఐ లవ్ పాకిస్థాన్’ అంటూ సందేశాలు
- హ్యాక్ చేసిన ముఠా టర్కిష్ ఆర్మీగా పోస్ట్
- దీనిపై ట్విట్టర్ తో మాట్లాడానన్న అనుపమ్ ఖేర్
- లాస్ ఏంజెలెస్ లో ఉన్నట్టు వెల్లడి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హైజాక్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాతాను హ్యాక్ చేసిన వారు టర్కీకి చెందిన వారిగా, తమను టర్కిష్ సైబర్ ఆర్మీగా ప్రకటించుకున్నారు. అనుపమ్ ఖేర్ ఖాతాను హ్యాక్ చేసిన ఈ సైబర్ ముఠా వింత సందేశాలను పోస్ట్ చేసింది.
‘మీ అకౌంట్ ను టర్కిష్ సైబర్ ఆర్మీ అయిలిడ్జ్ టీమ్ హ్యాక్ చేసింది. మీకు సంబంధించిన కీలక డేటాను సొంతం చేసుకున్నాం’, ‘ఐ లవ్ పాకిస్థాన్’ అని ట్విట్లు పెట్టేసింది. దీనిపై అనుపమ్ ఖేర్ స్పందించారు.
‘‘నా ట్విట్టర్ ఖాతా ఇప్పుడే హ్యాక్ అయింది. భారత్ లోని నా స్నేహితుల నుంచి ఇదే విషయమై కాల్స్ వచ్చాయి. నేను లాస్ ఏంజెలెస్ లో ఉన్నాను. ఇక్కడి సమయం అర్ధరాత్రి ఒంటిగంట. దీని గురించి ట్విట్టర్ తో ఇప్పటికే మాట్లాడాను’’ అని అనుపమ్ ఖేర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. తొలుత అనుపమ్ ఖేర్ ఖాతాను సస్పెండ్ చేసిన ట్విట్టర్ ఆ తర్వాత రిలీజ్ చేసింది.