raviteja: మళ్లీ రవితేజ పారితోషికం గురించే ఫిల్మ్ నగర్ టాపిక్!
- ఆకట్టుకోలేకపోయిన 'టచ్ చేసి చూడు'
- నిరాశపరుస్తోన్న వసూళ్లు
- రవితేజ నిర్ణయంపై ఆసక్తి
ఆ మధ్య రవితేజ సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకోవాలంటూ నిర్మాతలు డిమాండ్ చేశారు. చాలా రోజుల పాటు ఈ విషయంలో పట్టువీడని రవితేజ, ఆ తరువాత పారితోషికం తగ్గించుకుని 'రాజా ది గ్రేట్' సినిమా చేశాడు. ఈ సినిమా రవితేజకి సక్సెస్ ను ఇవ్వడంతో పాటు, ఆయన అభిమానులకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
దాంతో మళ్లీ రవితేజ తన పారితోషికాన్ని పెంచేశాడు. అలా పెంచేసిన పారితోషికంపైనే 'టచ్ చేసి చూడు' సినిమా చేశాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేకపోయింది. నాగశౌర్య 'ఛలో' సినిమా పోటీని కూడా తట్టుకోలేక, 'టచ్ చేసి చూడు' వసూళ్ల పరంగా బలహీనపడింది. దాంతో మళ్లీ రవితేజ పారితోషికం విషయంపై ఫిల్మ్ నగర్లో గుసగుసలు మొదలైపోయాయి. పారితోషికం తగ్గించుకోకపోతే కష్టమేనంటూ చెప్పుకుంటున్నారు. మరి రవితేజ ఓ మెట్టు దిగుతాడో ..అక్కడే ఉంటానంటాడో చూడాలి.