Telangana: గ్రహణ నరబలి కేసు తేలింది... హంతకుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే!
- కరీంనగర్ జిల్లా నుంచి పాపను తెచ్చిన రాజశేఖర్
- భార్య శ్రీలత ఆరోగ్యం కోసమేనట
- మొండాన్ని రికవరీ చేయనున్నామన్న పోలీసులు
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చంద్ర గ్రహణ నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఉప్పల్ లోని చిలుకానగర్ లో ఓ డాబాపై మొండెం లేని చిన్నారి తల కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత పక్కింటి వ్యక్తి నరహరిని, ఆపై మరెందరినో విచారించిన పోలీసులు చివరికి ఇంటి యజమాని, క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని తేల్చారు.
తన భార్య శ్రీలత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలంటే నరబలి ఇవ్వాలని ఎవరో చెప్పిన మాటలు విని ఈ పని చేసినట్టు రాజశేఖర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పాపను కరీంనగర్ జిల్లాలోని ఓ తండా నుంచి తీసుకు వచ్చినట్టు కూడా చెప్పాడు. నరహరి ఇంట్లో అతని కుమారుడు రంజిత్, పూజారి సాయంతో పూజలు చేశామని చెప్పాడు. కాగా, పాప మొండాన్ని రికవరీ చేయాల్సి వుందని, రాజశేఖర్ కు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.