Prime Minister: 11 గంటలకు టీడీపీ ఎంపీలకు మోదీ అపాయింట్ మెంట్!
- రాజ్ నాథ్ సింగ్ సమావేశం సత్ఫలితాన్నివ్వకపోవడంతో నిరసనలు కొనసాగుతాయన్న టీడీపీ నేతలు
- సుజానా చౌదరి, మరో నలుగురు ఎంపీలకు ఆహ్వానం
- టీడీపీ నేతలతో 11 గంటలకు ప్రధాని సమావేశం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం సత్ఫలితాలివ్వకపోవడంతో పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని ఎంపీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఆగ్రహాన్ని చల్లార్చేందుకు మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. నేటి ఉదయం 11 గంటలకు పీఎంవో నుంచి టీడీపీ నేతలకు ఆహ్వానం వెళ్లింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మరో నలుగురు ఎంపీలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధానికి మరోసారి వివరించనున్నారు.
ప్రధాని సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలు (శివసేన, టీడీపీ) తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో, దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. టీడీపీని బుజ్జగించేందుకు ఏం చేస్తుందోనని సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.