Kidnap: కిడ్నాపర్‌ను చంపి విద్యార్థిని విడిపించిన ఢిల్లీ పోలీసులు.. 12 రోజుల తర్వాత తల్లి ఒడికి చేరిన బాలుడు

  • జనవరి 25న స్కూల్ వ్యాన్ డ్రైవర్‌ను చంపి విద్యార్థి అపహరణ
  • రూ.60 లక్షల డిమాండ్
  • సోమవారం పోలీసులకు-కిడ్నాపర్లకు మధ్య ఎన్‌కౌంటర్

కిడ్నాపైన 12 రోజల తర్వాత ఐదేళ్ల బాలుడిని పోలీసులు విడిపించారు. ఈ సందర్భంగా కిడ్నాపర్లకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కిడ్నాపర్ హతమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలో సోమవారం జరిగిందీ ఘటన. జనవరి 25న స్కూలు బస్సు డ్రైవర్‌ను కాల్చి చంపిన కిడ్నాపర్లు ఐదేళ్ల బాలుడిని అపహరించారు. అనంతరం 60 లక్షలు కావాలంటూ చిన్నారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కిడ్నాపర్లను గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపినట్టు స్పెషల్ కమిషనర్ ఆర్‌పీ ఉపాధ్యాయ తెలిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో రవి అనే కిడ్నాపర్ హతమయ్యాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చిన్నారి క్షేమంగా ఉన్నాడని, తల్లిదండ్రులకు అతడిని అప్పగించామని వివరించారు. జాయింట్ కమిషనర్ (క్రైమ్) అలోక్ కుమార్ సారథ్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్టు పేర్కొన్నారు.

కాగా, ఢిల్లీలో జనవరిలో జరిగిన రెండో కిడ్నాప్ ఇది. ఒకటో తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేసిన దుండగులు రూ. 5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.4 కోట్లు చెల్లించి కుమారుడిని విడిపించుకున్నారు.

  • Loading...

More Telugu News