Petrol: మోదీ వచ్చాక రికార్డు స్థాయికి పెట్రోలు ధర!
- రూ. 81 దాటిన లీటర్ పెట్రోలు ధర
- నెల రోజుల వ్యవధిలో రూ. 4కు పైగా పెరిగిన ధర
- సుంకాలు తగ్గించడం లేదన్న విమర్శలు
నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు గద్దెనెక్కాక, పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ. 78 నుంచి రూ. 81కి పైగా ఉంది. సోమవారం నాడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజెల్ పై 7 పైసల మేరకు ధర పెరిగింది. దీంతో ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 81.17గా నమోదైంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వేళ, లీటరు పెట్రోలు ధర రూ. 72గా ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. గడచిన నెల రోజుల వ్యవధిలోనే పెట్రోలు ధర 4 రూపాయలకు పైగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారల్ కు 132 డాలర్ల వద్ద ఉన్న సమయంలోనూ, పెట్రోలు ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యే ఉండగా, ఆ స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం క్రూడాయిల్ ధర 60 డాలర్లకన్నా దిగువనే ఉన్నప్పటికీ, పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న వేళ, పన్నులను పెంచుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానాను నింపుకునేందుకే చూశాయని, ఇప్పుడు ధరలు పెరుగుతుంటే మాత్రం పన్నులను సవరించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.