India: ఇండియా ఏం చేస్తుందోనని భయపడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం!
- సీపీఈసీ నిర్మాణాలపై భారత్ దాడి చేస్తుందేమో
- 400 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇప్పిస్తోంది
- గిల్గిత్ హోం శాఖకు పాక్ ప్రభుత్వం లేఖ
- భద్రత పెంచాలని సూచన
చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్, కారిడార్ నిర్మాణాలపై దాడులకు దిగుతుందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం గిల్గిత్ బాల్టిస్థాన్ హోం శాఖకు ఓ లేఖ రాస్తూ, సీపీఈసీలో భద్రతను పెంచాలని సూచించింది. ఈ విషయంపై 'డాన్' పత్రిక ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. 400 మంది ముస్లిం యువకులను ఎంపిక చేసిన భారత్, వారిని శిక్షణ కోసం ఆఫ్గనిస్థాన్ కు పంపిందని, వారు శిక్షణ తరువాత సీపీఈసీలోని నిర్మాణాల విధ్వంసానికి దిగనున్నారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ భయపడుతున్నట్టు తెలిపింది.
కోరాకోరం హైవేపై ఉన్న వంతెనలే లక్ష్యంగా వీరు విరుచుకుపడవచ్చని హెచ్చరిస్తూ, మరింత మంది సైన్యాన్ని అక్కడ నియమించాలని కోరింది. కాగా, ఇప్పటికే సీపీఈసీ మార్గంలో సెక్యూరిటీని పెంచగా, వంతెనలు ఉన్న చోట్ల, సునిశిత ప్రాంతాలుగా గుర్తిస్తూ భద్రతను మరింత పెంచింది. కాగా, సీపీఈసీ ప్రాజెక్టును చైనా ప్రకటించినప్పటి నుంచి భారత్ తీవ్రంగా అభ్యంతర పెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ఇండియాతో చర్చలకు సిద్ధమని చైనా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లోని గ్వదార్ నౌకాశ్రయానికి, చైనాలోని క్సింజియాంగ్ ప్రావిన్స్ ను కలుపుతూ నిర్మిస్తున్న ఈ కారిడార్ లో పలు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి వల్ల తన సార్వభౌమాధికారానికి విఘాతం కలుగుతుందన్నది భారత్ ప్రధాన అభియోగం.