KVP Ramachandra Rao: 'జగన్, కేవీపీ కలవకుండా మీరు అడ్డుపడుతున్నారా?' అని వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తే ఇచ్చిన జావాబు ఇదిగో!

  • వైఎస్ మరణం తరువాత జగన్ కు అండగా నిలవని కేవీపీ
  • కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న సీనియర్ నేత
  • ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తామన్న వైవీ సుబ్బారెడ్డి
  • ఆయన ఎందుకు రాలేదో తెలియదన్న జగన్ బాబాయ్

వైఎస్ జగన్, కేవీపీ రామచంద్రరావు కలవకుండా తాను అడ్డుపడ్డానని జరుగుతున్న ప్రచారాన్ని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కేవీపీ, జగన్ కు అండగా నిలువకుండా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన విషయం ప్రస్తావనకు వచ్చింది.

మీకు, కేవీపీకి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాలేదా? అన్న ప్రశ్న ఎదురైంది. "ఇది తప్పు. అటువంటిది ఏమీ లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతించడానికి సిద్ధం. ఆయనకుండే కొన్ని సమస్యల వల్ల రాలేకపోయారేమో. అందుకు కారణాలు ఆయన్నే అడగండి. నాకు తెలియదు" అన్నారు.

పార్టీకి షర్మిల, విజయమ్మ దూరంగా ఉన్నారన్న వార్తలపై స్పందిస్తూ, అటువంటిది కూడా ఏమీ లేదని, వారి అవసరం ఎప్పుడు వచ్చినా, సేవలు అందిస్తారని చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షులుగా ఇప్పటికీ విజయమ్మ ఉన్నారని గుర్తు చేసిన వైవీ సుబ్బారెడ్డి, జగన్ అరెస్టయిన వేళ, షర్మిల బాధ్యతలు చేపట్టారని, ఆమె మళ్లీ ప్రచారానికి వస్తారని స్పష్టం చేశారు. జగన్ కు, షర్మిల మధ్య పొరపచ్చాలు ఉన్నాయన్న వార్తలు 'సుత్తి' అన్నారు. ఇటీవల ప్లీనరీకి కూడా ఆమె వచ్చారని గుర్తు చేశారు.

 తదుపరి ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల పోటీ చేస్తారా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేసిన ఆయన, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం గురించి ఆలోచించిన మీదటే, విజయమ్మను వైజాగ్ నుంచి ఎంపీగా బరిలోకి దింపామని అన్నారు. ఆ పరాజయాన్ని విశ్లేషించుకున్నామని, భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామని చెప్పారు.

KVP Ramachandra Rao
YV Subba Reddy
Jagan
YSRCP
Vijayamma
Sharmila
  • Loading...

More Telugu News