Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన రాజ్ నాథ్ సింగ్
- టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసే ముందు రాజ్ నాథ్ ఫోన్
- టీడీపీ నిరసనను అర్థం చేసుకున్నాం
- తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు
- కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కోరిన రాజ్ నాథ్
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన విషయమై టీడీపీ అధినేత, నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఈరోజు చర్చించారు. ఈ సమావేశం ముగుస్తుందన్న సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చింది. టీడీపీ నిరసనను తాము అర్థం చేసుకున్నామని, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాజ్ నాథ్ కోరినట్టు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఫోన్ చేసి మాట్లాడతారని చంద్రబాబుకు రాజ్ నాథ్ చెప్పినట్టు సమాచారం. కాగా, కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలని తమ ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. అయితే, రాజ్ నాథ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో చివరి నిమిషంలో టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రంతో సంప్రదింపుల ఫలితాన్ని అనుసరించి నిరసనలకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.