Chandrababu: పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు గట్టిగా మాట్లాడాలి .. ఇది తొలి అడుగు మాత్రమే : చంద్రబాబు

  • ముగిసిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం
  • కేంద్రం వైఖరి చూసిన తర్వాత వారితో కలిసి ఉండటమా? తప్పుకోవడమా? అనేది నిర్ణయిద్దాం
  • ఎంపీలతో చంద్రబాబు

కేంద్రబడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపడంపై  తమ నిరసన తెలియజేద్దామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలందరూ పార్లమెంట్ లో తమ గళాన్ని గట్టిగా వినిపించాలని, తాము చేసే పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేని చెప్పినట్టు సమాచారం. కేంద్రం వైఖరి చూసిన తర్వాత వారితో మిత్రపక్షంగా ఉండటమా లేక తప్పుకోవడమా అనే విషయమై ఓ నిర్ణయం తీసుకుందామని ఎంపీలతో చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సింది నియోజకవర్గాల పెంపు కాదని, న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాలని, ఆ ప్రయోజనాలు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఎంపీలతో చంద్రబాబు అన్నట్టు సమాచారం. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీ ఎంపీలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎంపీలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ గురించి చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ పై జగన్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు అన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News