Tejas: భారత వాయుసేన చరిత్రలో తొలిసారి... తేజస్ విమానంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్
- 40 నిమిషాలు పర్యటించిన డేవిడ్ ఎల్ గోల్డ్ ఫిన్
- చాలా బాగుందని కితాబు
- త్వరలోనే వాయుసేనకు సీ-17 గ్లోబ్ మాస్టర్ లు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియా తయారు చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్ పై అమెరికా పొగడ్తలు కురిపించింది. అమెరికా వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్, జనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్ ఫిన్ ఇండియాకు వచ్చిన సందర్భంగా, తేజస్ విమానంలో 40 నిమిషాల పాటు ప్రయాణించి, దాని పనితీరును పరిశీలించారు. ఇలా ఓ విదేశీ వాయుసేన అధిపతి, భారత యుద్ధ విమానంలో ప్రయాణించడం వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా శుక్రవారం నాడు డేవిడ్ ఎల్ గోల్డ్ ఫిన్ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై జోధ్ పూర్ లోని వాయుసేన స్థావరాన్ని సందర్శించిన ఆయన, వైస్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ తో కలసి తేజస్ లో తిరిగొచ్చారు. ఆపై ఆయన మాట్లాడుతూ, తేజస్ విమానం చాలా బాగుందని అన్నారు. సీ-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాలను త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగిస్తామని చెప్పిన ఆయన, ఈ తరహా విమానాలను వాడుతున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు.