Andhra Pradesh: మార్చిలోగా దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేయకుంటే ఆందోళన చేపడతాం: రఘువీరారెడ్డి
- విజయవాడలోని ధర్నా చౌక్ లో మహాధర్నా
- ఆ ఫ్లైఓవర్ దగ్గరే నిరవధిక నిరసన దీక్షలకు దిగుతాం
- ఈ నెల 5 నుంచి 15 వరకు నిరసనలు చేపడతాం
- ఈ నెల 8న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నాం: రఘువీరా
మార్చి లోగా దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయకుంటే ఆందోళనకు దిగుతామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హెచ్చరించారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలోనూ ఎక్కడాలేని జాప్యం చేస్తున్నారని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం దృష్టంతా దోపిడీపైనే ఉంది తప్ప, అభివృద్ధిపై కాదని విమర్శించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పేరును చంద్రన్న ఫ్లై ఓవర్ గా మార్చుకుని, దీని నిర్మాణపు పనులు చేపట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మార్చి లోపు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని, లేకుంటే ఏప్రిల్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆ ఫ్లైఓవర్ దగ్గరే నిరవధిక నిరసన దీక్షలకు దిగుతాయని హెచ్చరించారు. కాగా, ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ-టీడీపీ విధానాలను నిరసిస్తూ ఈ నెల 5 నుంచి 15 వరకు మండల కేంద్రాల్లో నిరసనకు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. ‘ఆంధ్రాను కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న రాష్ట్ర బంద్ కు పిలుపు నిస్తున్నామని, ఈ బంద్ లో అందరూ భాగస్వాములు కావాలని రఘువీరా కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయని, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనమని అన్నారు.