seetharam yechuri: వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు... ఏపీకి ఎందుకు ఇవ్వరు?: కేంద్రంపై సీతారాం ఏచూరి ఫైర్
- టీడీపీ, బీజేపీ పొత్తుతో ఏపీకి వచ్చిందేమీ లేదు
- బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారు
- బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేకపోవడం దారుణం
ఏపీకి ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేరలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం... ఏపీకి ఎలాంటి సాయం చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వడం లేదని అన్నారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని విడదీసిన క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా, అంతకంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీనే చెప్పిందని... కానీ మాట తప్పిందని విమర్శించారు. ఏపీకి ఏదైనా ఇస్తే పక్క రాష్ట్రాలతో ఇబ్బంది వస్తుందనే వాదన పూర్తిగా అసంబద్ధమని చెప్పారు.
బీజేపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విడదీసినప్పుడు అక్కడ ఏమేం ఇవ్వాలో, ఏమేం చేయాలో అంతా చేశారని... మరి ఏపీకి మాత్రమే ఇబ్బందులు ఎందుకని ఏచూరి అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి బీజేపీకి సరైన సమాధానాన్ని ప్రజలే ఇస్తారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేకపోవడం చాలా దారుణమని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు లేవని చెప్పారు. టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఏపీకి నిధులు వస్తాయని ఊదరగొట్టినవాళ్లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు.