Chandrababu: చంద్రబాబునాయుడితోనే మంచిగా ఉండాల్సిన అవసరం మోదీకి లేదు! : ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ

  • చంద్రబాబు కాకపోతే జగన్ లేదా పవన్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి
  • ఎవరినైనా ఫుట్ బాల్ ఆడటమే తప్ప, కౌగిలించుకునే స్వభావం మోదీకి లేదు 
  • ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మోదీది కాదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావన రాకపోవడంపై బీజేపీ మిత్ర పక్షమైన టీడీపీతో పాటు ఇతర పార్టీల నాయకులూ విమర్శలు గుప్పిస్తున్నారు. మిత్ర ధర్మం పాటిస్తూనే ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు తమ నేతలకు సూచించడం విదితమే. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీని, మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఏపీకి కావాల్సిన వాటి గురించి చంద్రబాబు ఏకరువు పెట్టారు. అయినప్పటికీ, ఏపీకి అన్యాయం జరిగింది.

చంద్రబాబును మోదీ పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందిస్తూ కొన్ని విషయాలను ప్రస్తావించారు. ‘నాటి ఎన్డీయే ప్రభుత్వం.. వాజ్ పేయి ప్రభుత్వం టీడీపీ, చంద్రబాబునాయుడి మద్దతు లేకుండా మనుగడ సాధించే పరిస్థితిలో లేని మైనార్టీ ప్రభుత్వం. ఈరోజు, నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వతంత్రంగా లోక్ సభలో మెజార్టీ ఉన్న ప్రభుత్వం. ముందు నుంచి ఎన్డీఏలో టీడీపీ, ఇతర మిత్రపక్షాలు ఉన్నాయి కనుక, భవిష్యత్ లో వీరు అవసరం కనుక ఆయా పార్టీలను బీజేపీ కలుపుకుంటోంది.

బీజేపీ అధికారంలో ఉండటానికి ఈ మిత్రపక్షాల అవసరం కూడా లేదు. బార్గెయినింగ్ లెవరేజ్ చంద్రబాబుకు లేదు కనుకనే మోదీ పట్టించుకోవట్లేదని ఒక వాదన. రెండో వాదన ఏంటంటే.. వాజ్ పేయి హయంలో టీడీపీతో పొత్తుపెట్టుకోకుండా మనుగడ సాధించలేని పరిస్థితి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మిత్రపక్షంగా టీడీపీ మినహా మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదు.

మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి లేదు.. వైఎస్సార్సీపీ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా శాతం రెండు మాత్రమే. ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే, వైఎస్సార్సీపీకే నాలుగైదు ఎంపీ సీట్లు ఎక్కువొస్తాయని అంటున్నారు. ఒకవేళ, బీజేపీ నుంచి మిత్రపక్షమైన టీడీపీ వెళ్లిపోతే .. ఎన్నికలకు ముందు లేదా తర్వాత అయినా ఆ స్థానంలో వైఎస్సార్సీపీ చేరుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.

అంటే చంద్రబాబు నాయుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి లేదా పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీకి మూడు అవకాశాలు ఉన్నాయి కనుక, చంద్రబాబునాయుడితోనే మంచిగా ఉండాల్సిన అవసరం మోదీకి లేదు. మూడో వాదన.. వాజ్ పేయికి, మోదీకి మధ్య స్పష్టమైన తేడా ఉంది. వాజ్ పేయి అందరినీ కలుపుకుని పోయేవారు. మోదీ తన ప్రత్యర్థుల పట్ల దయలేకుండా ఉంటారు. తన ప్రభుత్వ, పార్టీ ప్రయోజనాలు మినహా దేన్నీ మోదీ పట్టించుకోరు. ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మోదీది కాదు. ఎవరినైనా ఫుట్ బాల్ ఆడే స్వభావమే తప్ప, కౌగిలించుకునే స్వభావం కాదు’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News