Cricket: భారత్ అండర్-19 ఆటగాళ్లపై ప్రశంసల జల్లు.. బీసీసీఐ భారీ నజరానా!
- ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున నజరానా
- రాహుల్ ద్రవిడ్ కు 50 లక్షలు, సహాయ సిబ్బందికి 20 లక్షల చొప్పు బహుమానం
- మాజీ దిగ్గజాలు, టీమిండియా ఆటగాళ్లు, పారిశ్రామిక వేత్తల ప్రశంసలు
భారత్ అండర్-19 ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరల్డ్ కప్ సాధించి దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసిన జట్టుకు బీసీసీ భారీ నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఇక జట్టు, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 50 లక్షలు, సహాయ సిబ్బందికి 20 లక్షల చొప్పున బహుమతి ప్రకటించిడం జరిగింది. టీమిండియా మాజీ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అండర్-19 ఆటగాళ్లకు ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు చెప్పారు.
సచిన్ జట్టును అభినందిస్తూ 'శుభాకాంక్షలు ఛాంపియన్స్, దేశాన్ని గర్వించేలా చేశారు. రాహుల్, పరస్ కు శుభాకాంక్షలు' అన్నాడు. రైనా తన ట్విట్టర్ ఖాతాలో 'అజేయమైన భారత అండర్ 19 ఆటగాళ్లు విజయానికి వందశాతం అర్హులు. ఈ విజయాన్ని ఆస్వాదించండి. కానీ ఇది ఆరంభం మాత్రమేనని గుర్తించండి. జట్టు విజయం వెనుక నిరంతర స్పూర్తిగా నిలిచిన రాహుల్ ద్రవిడ్ కు పెద్ద కేక' అన్నాడు.
సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, వర్ధమాన ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ వంటి సురక్షితమైన దిగ్గజం చేతుల్లో ఉన్నారని, భవిష్యత్ క్రికెట్ కు అద్భుతమైన ప్రతిభగల క్రీడాకారులు తయారవుతున్నారని పేర్కొన్నాడు. ప్రతిభారతీయుడు రాహుల్ ద్రవిడ్ అంకితభావాన్ని కొనియాడుతున్నారని ప్రశంసించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర జూనియర్ల ఆటను కొనియాడుతూ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారి వరల్డ్ కప్ విజయ క్షణాలకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు.