Uttar Pradesh: యూపీలో 48 గంటల్లో 15 ఎన్ కౌంటర్లు.. ఒక గ్యాంగ్ స్టర్ హతం, మరో 24 మంది అరెస్ట్
- గ్యాంగ్ స్టర్లను అరికట్టేలా యూపీ సీఎం సంచలన నిర్ణయం
- ప్రాణాలతో పట్టుకోవాలని పోలీసులకు ఆదేశం
- మూడు రోజులుగా సాగుతున్న ప్రత్యేక ఆపరేషన్
పరిపాలనలో తనదైన శైలి చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.. మరో సంచలనం సృష్టించారు. రాష్ట్రంలోని గ్యాంగ్ స్టర్లను పట్టుకోవాలన్న యోగి ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కేవలం 48 గంటల్లో (బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు) 15 ఎన్ కౌంటర్లు చేసి.. 24 మంది గ్యాంగ్ స్టర్లను పట్టుకున్నారు. ఒక గ్యాంగ్ స్టర్ మాత్రం పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ ఆపరేషన్ సందర్భంగా యూపీ పోలీసులు పెద్ద ఎత్తున దేశీ, విదేశీ ఆయుధాలతో పాటు ఆ గ్యాంగ్ స్టర్లు దోచుకున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు, కార్లు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన గ్యాంగ్ స్టర్లంతా ‘వాంటెడ్’ జాబితాలో ఉండడం, కొందరి తలలపై రూ. 15,000 నుంచి రూ. 50,000 వరకు వెలలు ఉండడం గమనార్హం.
జాగ్రత్తగా ఆపరేషన్: యూపీ డీజీపీ
గ్యాంగ్ స్టర్లను ప్రాణాలతో పట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప గ్యాంగ్ స్టర్లపై నేరుగా కాల్పులు జరపవద్దని ఆదేశించామని తెలిపారు. యూపీలోని ప్రధాన జిల్లాలైన ముజఫర్ పూర్, గోరఖ్ పూర్, బులంద్ షహర్, షామిలి, హపూర్, మీరట్, షహరన్ పూర్, కాన్పూర్, లక్నో జిల్లాల పరిధిలో ఈ ఎన్ కౌంటర్లు నిర్వహించామని చెప్పారు.
పలు చోట్ల గ్యాంగ్ స్టర్లు కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఇందులో ఘజియాబాద్ కు చెందిన ఇంద్రపాల్ అనే గ్యాంగ్ స్టర్ మాత్రం మరణించాడని, అతడిపై 33 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఎన్ కౌంటర్ల సందర్భంగా పలువురు గ్యాంగ్ స్టర్లకు బుల్లెట్ గాయాలు అయ్యాయని.. వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామని యూపీ డీజీపీ వెల్లడించారు.