Australia: ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ బౌలింగ్‌ను చితక్కొట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన డేవిడ్ విల్లీ
- బ్యాటింగ్‌లో సిక్సర్లతో చెలరేగిన వైనం
- నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 34 పరుగులు
వరుసగా మూడు వికెట్లు తీసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, తర్వాత బ్యాటింగ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. టీ20 టూర్ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్, ఇంగ్లండ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాలోని మనుకా ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో యాషెస్ సిరీస్‌లో విజృంభించిన ఆసీస్ బౌలర్ నాథన్ లియన్పై ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ డేవిడ్ విల్లీ ప్రతీకారం తీర్చుకున్నాడు.
బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ప్రైమ్ మినిస్టర్స్ జట్టును దెబ్బతీసిన విల్లీ.. బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ వేసిన రెండో ఓవర్లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన విల్లీ చివరి బంతిని బౌండరీకి తరలించాడు. ఫలితంగా ఒకే ఓవర్లో 34 పరుగులు లభించాయి. మొత్తం 36 బంతులు ఎదుర్కొన్న ఆయన 79 పరుగులు చేశాడు. విల్లీ దెబ్బకు ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. విల్లీ విజృంభణకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియని ఆసీస్ చేష్టలుడిగి చూస్తుండిపోయింది.