Uttar Pradesh: అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ అడ్డంగా దొరికిన యూపీ పోలీస్ డైరెక్టర్ జనరల్!

  • ప్రైవేటు కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసిన పోలీసు డీజీ
  • వివాదాస్పదమైన వీడియో
  • చర్యలు ఉంటాయన్న ఐపీఎస్ అసోసియేషన్
  • నష్ట నివారణ చర్యల్లో సూర్య కుమార్

బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఓ పోలీసు అధికారి అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో తీవ్ర వివాదాస్పదమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న యూపీ డైరెక్టర్ జనరల్ (హోంగార్డ్) సూర్య కుమార్ అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. యూపీలో రెండో అత్యున్నత ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రతిజ్ఞకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల వరకు ఆయన పోలీస్ చీఫ్ పోస్టు కోసం పోటీ పడ్డారు కూడా.

‘అఖిల భారతీయ సమగ్ర విచార్ మంచ్’ కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య కుమార్ ‘‘మేమందరం రామ భక్తులం. వీలైనంత త్వరలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని మేమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై శ్రీరామ్’’ అని  ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగు చూడడంతో సూర్యకుమార్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించారని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. రామ మందిర వివాదానికి సంబంధించి సామరస్య పూర్వక పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. వీడియోలో తాను జై శ్రీరామ్ అన్నట్టుగా మాత్రమే ఉందని, పూర్తి వీడియో ఉంటే నిజాలు తెలిసేవని అన్నారు.

మరోవైపు ఈ వీడియో వైరల్ అవడంతో స్పందించిన ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఆయనను దూరంగా ఉంచాలని నిర్ణయించింది. సూర్యకుమార్‌పై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తటస్థంగా, నిక్కచ్చిగా ఉండాలన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ నిబంధనలకు ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించారని పేర్కొంది.

  • Loading...

More Telugu News