Chandrababu: ఏదో ఒకటి చేయండి... ప్రజల్లో కోపం తగ్గించకపోతే మనకు చాలా కష్టం: చంద్రబాబుకు స్పష్టం చేసిన నేతలు

  • బడ్జెట్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
  • వైకాపాది రెండు నాలుకల ధోరణి
  • వాడివేడిగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • ఏదైనా చేద్దామంటున్న నేతలు

ఇటీవల జరుగుతున్న పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని, ముఖ్యంగా బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి చూపించడంపై వారిలో ఉన్న కోపాన్ని తగ్గించకుంటే, పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. నేడు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుండగా, ఇందులో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు అధినేత ముందు వెల్లడించారు.

బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని, వారిలో ఉన్న ఆగ్రహమే మనలోనూ ఉందని చూపేందుకు ఏదో ఒకటి చేయాలని సూచించారు. బడ్జెట్ పై స్పందించలేని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని వ్యాఖ్యానించిన పలువురు, ఆ పార్టీ రెండు నాలుకల వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. జగన్ ఇప్పటివరకూ బడ్జెట్ పై తన ప్రతిస్పందనను తెలియజేయలేదని గుర్తు చేశారు.

తొలుత బడ్జెట్ బాగాలేదని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి, ఆపై బాగుందని జాతీయ మీడియా ముందు వ్యాఖ్యానించడాన్ని కొందరు ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ సభలో నిరసన తెలియజేయాలని చినరాజప్ప సూచించగా, ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని మరో మంత్రి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News