Chiranjeevi: కన్నడ సీమలో మెగా బ్రదర్స్ సవాల్... వేర్వేరు పార్టీలకు చిరంజీవి, పవన్ ప్రచారం!
- త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
- జేడీఎస్ తరఫున పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించిన కుమారస్వామి
- కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్న చిరంజీవి
- కోలార్, బళ్లారి, బెంగళూరు, బీదర్, రాయచూర్ జిల్లాల్లో పర్యటనలు!
త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ నేతగా చిరంజీవి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనుండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీఎస్ కు ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తుండటంతో మెగా బ్రదర్స్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరుగుతుందన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తున్నారని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ప్రకటించేశారు. కన్నడ సీమలో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైన కోలార్, బెంగళూరు, బళ్లారి, రాయచూర్, చిక్ బళ్లాపూర్, బీదర్ తదితర జిల్లాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. ఇక వారి ఓట్లను టార్గెట్ గా చేసుకున్న రాజకీయ పార్టీలు, సాధ్యమైనన్ని ఎక్కువ రోజుల పాటు హీరోలతో ప్రచారం చేయించాలని చూస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవితో ప్రచారం చేయించే బాధ్యతలను కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కు సీఎం సిద్ధరామయ్య అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ప్రచారం చేయాల్సిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని, ఆయన వస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి చేసిన ప్రచారం, కాంగ్రెస్ పార్టీకి లాభించింది. ఆ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా చిరంజీవిని పిలిచి ప్రచారం చేయించాలని సిద్ధరామయ్య నిర్ణయించి, విషయాన్ని అధిష్ఠానానికి చేరవేశారని, అధిష్ఠానం సైతం అందుకు అంగీకరించి, ప్రచారం నిమిత్తం వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక మెగా బ్రదర్స్ రంగంలోకి దిగి, ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేస్తుంటే ఎలా ఉంటుందో?